విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో గణితం, సైన్స్‌, ఆంగ్లం సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య, రాత పుస్తకాలు తనిఖీ చేసి కొందరు విద్యార్థులకు స్వయంగా అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలపై ఆరా తీయగా.. ప్రస్తుతం 702 మంది విద్యార్థులు ఉన్నారని, ఇప్పటి వరకు 65 మంది విద్యార్థులు కొత్తగా చేరారన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటుతుందని భావిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి విద్యార్థులు ఒక్కరు కూడా ఫెయిల్‌ కాకుండా చూడాలన్నారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రవేశ సమయంలోనే అపార్‌ ఐడీలను రూపొందించాలని, యూ డైస్‌ పోర్టల్‌లో విద్యార్థుల వివరాలను సకాలంలో నమోదు చేసి నవీకరించాలన్నారు. అదనపు తరగతి గదులు, ప్రహరీ, ఇతర మౌలిక వసతులు అవసరమైతే జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా ప్రతిపాదనలు పంపించాలని, అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే విద్యార్థుల డ్రాప్‌బాక్స్‌లో ఎలాంటి అంశాలు పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కలెక్టర్‌ వెంట జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్‌ డీఈఓ యాదయ్య, ప్రిన్సిపాల్స్‌ ఉమాదేవి, చంద్రశేఖర్‌, ఇతర విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement