ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్ పనులు వేగంగా జరగాలంటే భూ సేకరణకు రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆర్‌అండ్‌ఆర్ భూ సేకరణ రాష్ట్ర కమిషనర్ కె.శివకుమార్‌నాయుడు కోరారు. బుధవారం మండల కేంద్రం శివారులోని గణపసముద్రం రిజర్వాయర్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్ అలుగు మూడు ఫీట్లు పెంచడంతో గ్రామంలోకి నీళ్లు వస్తాయని.. అరికట్టేందుకు గ్రామం దగ్గర కరకట్ట నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన భూముల ధరలకు అనుగుణంగా ఇక నుంచి రైతులకు ఇచ్చే పరిహారం రూ.20 లక్షలకు పెంచాలన్నారు. పూర్తిస్థాయిలో భూములు కోల్పోతున్న రైతులకు ఏడు కోట్ల భూమిలో ఒక్కొక్కరికి కనీసం 3 గుంటలు పట్టా చేయాలని కోరారు. భూమి ఉండటంతో ప్రభుత్వం ఇచ్చే రైతుబీమా వర్తిస్తుందన్నారు. ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని వారు కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గురువారం కలెక్టరేట్‌లో రైతులతో సమావేశం ఉంటుందని.. ప్రతి సమస్యను అక్కడ తెలియజేయాలని సూచించారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. రైతులందరు త్వరగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తే రెండు నెలల్లో పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి 164 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, నీటిపారుదలశాఖ అధికారులు లక్ష్మీనర్సింహారెడ్డి, తహసీల్దార్ సుగుణ, వివిధ శాఖల అధికారులు, రైతులు ఉన్నారు.
ఆర్‌అండ్‌ఆర్
భూ సేకరణ
రాష్ట్ర కమిషనర్
శివకుమార్‌నాయుడు


