వనపర్తి రూరల్: దేశంలో కార్మిక సంఘాలను రూపుమాపేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని.. కార్మికులంతా సంఘటితంగా ఉండి తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి నర్సింహ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీహరి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. గతంలో ఏడుగురు సభ్యులతో కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే వీలుండేదని.. ఇప్పుడు 100 మంది సభ్యులు ఉండాలని నిబంధన విధించిందని తెలిపారు. ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘంగా పరిగణిస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచి సంపన్నులకు పెట్టడమే ధ్యేయంగా పని చేస్తోందని తెలిపారు. కార్మికులను సంఘటితం చేసి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు ఈ నెల 30, 31న పెబ్బేరులో నిర్వహించాలని, 23న సన్నాహక సమావేశం ఉంటుందని తెలిపారు. మహాసభలకు కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. జిల్లాలో కార్మిక సంఘాల ఏర్పాటు, బలోపేతానికి పార్టీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి మోషా, గోపాలకృష్ణ, భాస్కర్, శ్యామ్, రఘు, సుందర్, ఖయ్యూం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వానిదే’
ఖిల్లాఘనపురం: వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వాలదేనని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి జిల్లా కోశాధికారి భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి వైద్యాధికారి డా. మాధవి జెండా ఆవిష్కరించగా.. ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని.. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యసిబ్బంది డా. సందేశ్, వెంకటలక్ష్మి, ప్రభావతి, వెంక టేష్, భీమయ్య, మునీందర్, నజ్మా, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


