భూసేకరణలో చలనం | - | Sakshi
Sakshi News home page

భూసేకరణలో చలనం

Jun 16 2026 12:52 AM | Updated on Jun 16 2026 12:52 AM

వేగవంతంగా చేస్తున్నాం..

క్షేత్రస్థాయి పర్యటనతో..

నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్‌ పరిధిలో

567 ఎకరాలు

ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తిచేసేలా అధికారుల కసరత్తు

ఆర్‌అండ్‌ఆర్‌లో పూర్తిస్థాయి

మౌలిసదుపాయాల కల్పనకు చర్యలు

ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం

గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్‌, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్‌ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది.

నడిగడ్డలో గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.

2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్‌ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది.

7,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్‌ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా గరిష్టంగా ఖరీఫ్‌ సీజన్‌లో 50 వేల ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. దీంతో రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. రిజర్వాయర్‌ కోసం 567 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. దాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది.

జిల్లాలో నెట్టెంపాడు, ఆర్డీఎస్‌, గట్టు ఎత్తిపోతలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పరిధిలో రైతులు పరిహారం డబ్బులు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు రైతులు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే నెట్టెంపాడు పరిధిలో 200 ఎకరాలకుపైగా భూమి సేకరణ పూర్తయింది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 45 రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

– రిజ్వాన్‌బాషా షేక్‌,

కలెక్టర్‌, జోగుళాంబ గద్వాల

సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్‌ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement