జిల్లాలో పునః ప్రారంభమైన పాఠశాలలు
● అమావాస్య సెంటిమెంట్‌తో మొదటి రోజు తరగతులకు రాని విద్యార్థులు
● ఎఫ్‌ఆర్‌ఎస్‌లో పదిశాతం కంటే
తక్కవగానే హాజరు నమోదు
● మామిడి తోరణాలు, పూలతో
పలు పాఠశాలల అలంకరణ
మారుమూల తండాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా పాఠశాలలు మూతబడవద్దని విద్యాశాఖ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపిస్తూ కొనసాగించారు. ప్రభుత్వం ఈసారి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో పాటు విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా.. చాలాచోట్ల కొత్త ప్రవే శాలు రాకపోవడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం కష్టమేననిపిస్తోంది.
గురుకులాలు, కేజీబీవీల్లో ప్రవేశాల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ఎగబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారస్ చేయిస్తూ ప్రవేశాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డేస్కాలర్స్ కేటగిరిలో ఉన్న సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆసక్తి చూపిస్తున్న వారు చాలా తక్కువేనని చెప్పవచ్చు.
వీపనగండ్ల మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. మరికొన్ని గ్రామాల్లో విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని.. ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు అందించడంతో పాటు నాణ్యత బోధన అందిస్తున్నామని కల్వరాల జెడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
‘పాన్‌గల్ మండలం మల్లాయపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో సోమవారం మొదటిరోజు రెండో తరగతి చదువుతున్న విద్యార్థి సంతోష్ ఒక్కరే హాజరయ్యారు. ఆ పాఠశాలలో ఉన్న ఏకోపాధ్యాయుడు శేఖర్‌గౌడ్ పాఠాలు బోధిస్తూ కనిపించారు. పాఠశాల మూతబడే అవకాశం ఉందని గతేడాది నుంచి ఒకే విద్యార్థితో నిర్వహణ సాగిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం రోజున ఉన్న
ఒకేఒక్క విద్యార్థి హాజరుకాగా.. ఉపాధ్యాయుడు స్వాగతించి బోధించడం కనిపించింది.’
వనపర్తి: వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి 2026–27 విద్యాసంవత్సరం ఆరంభమైంది. తొలిరోజు అమావాస్య కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అంతగా కనిపించలేదు. జిల్లావ్యాప్తంగా అతి తక్కువగా పది నుంచి 15 హాజరు శాతం దాటలేదని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రమే ఆన్‌లైన్ హాజరు నమోదు చేసుకున్నారు. ఇక కేజీబీవీలు, గురుకులాల విద్యార్థులు ఎవరూ హాజరుకాలేదు. మంగళవారం సైతం పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రవేశాల కోసం వచ్చిన వారితో పాఠశాల ఆవరణలు రద్దీగా కనిపించాయి. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల ప్రధాన ద్వారాలను మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు ఆహ్వానం పలికారు. పాఠశాలల పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు అందించాల్సి ఉండగా.. విద్యార్థులు సంఖ్యలో హాజరుకావడంతో పంపిణీ జరగలేదు. యూనిఫామ్స్ ఇప్పటి వరకు ఇంకా రాలేదు. విద్యార్థుల కొలతలు తీసుకొని స్థానిక మహిళా సంఘాల సభ్యులతో కుట్టించేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యూనిఫామ్‌కు కావాల్సిన వస్త్రం జిల్లాలు, మండలాలకు తెప్పించాల్సి ఉంది.


