ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

Jun 16 2026 12:52 AM | Updated on Jun 16 2026 12:52 AM

పాన్‌గల్‌: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయ చీఫ్‌ మొబిలైజేషన్‌ అధికారి (సీఎంఓ) ప్రతాప్‌రెడ్డి సూచించారు. బడిబాట కార్యక్రమలో భాగంగా సోమవారం మండల కేంద్రంతో పాటు రాయినిపల్లి, కొత్తపేట ప్రాథమిక, పాన్‌గల్‌ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించి విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో మొదటిరోజు ఆరుగురు విద్యార్థులు బడిలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ శ్రీధర్‌రెడ్డి, హెచ్‌ఎం పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్‌లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్‌లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్‌లో 44.09, ఐదో సెమిస్టర్‌లో 66.97, ఆరో సెమిస్టర్‌లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డీఎంకు

షోకాజ్‌ నోటీసులు

కందనూలు: జిల్లాస్థాయి మీడియా అక్రిడేషన్‌ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవడంతో నాగర్‌కర్నూల్‌ బస్‌ డిపో మేనేజర్‌ యాదయ్యపై కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులను సోమవారం ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని, నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement