వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమశాఖ, విద్యాశాఖ సమన్వయంతో పనిచేసి జిల్లాలో పోలియో మహమ్మారిని రూపుమాపేందుకు ఈ నెల 28న ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి బంగారు భవిష్యత్ ఇవ్వాలన్నారు.
జులై 13న నులిపురుగుల నివారణ దినం..
పల్స్ పోలియోతో పాటు జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్నపిల్లలకు వచ్చే అనీమియా, జీర్ణవ్యవస్థ సమస్యలు, పిల్లలు శారీరకంగా ఎదగకపోవడం వంటి సమస్యల నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్ర తినిపించి అనీమియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని చిన్నారులకు సరిపడా పోలియో వాయిల్స్, ఆల్బెండజోల్ మాత్రలు ఉన్నాయని చెప్పారు. జూన్ 28న ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేసే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినం రోజున ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్‌ఓ సూర్యప్రకాష్, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


