పాన్‌గల్: కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. సోమవారం మండలంలోని శాగాపూర్, జమ్మాపూర్‌లోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, బస్తాల తరలింపు, ఇంకా సేకరించాల్సిన ధాన్యం తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల్లోని రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని.. అకాల వర్షాలతో తడిసిపోయే ప్రమాదం ఉందని చాలా మంది రైతులు ఆయనకు వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ, బస్తాల తరలింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు ఎఫ్‌ఏక్యూ నిబంధనలకు లోబడి జరగాలని, హమాలీల సంఖ్య పెంచి ధాన్యం ఆన్‌లోడింగ్, బస్తాల తరలింపు వేగవంతం చేయాలన్నారు. లారీల సంఖ్య పెంచి కేంద్రాల్లోని ధాన్యం బస్తాలను తరలించాలని అధికారులకు సూచించారు. అధికారులు, కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ధాన్యం సేకరణలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ కార్తీక్‌రావు, ఏపీఎం శ్రీనివాసులు, ఆర్‌ఐ మహేష్, సర్పంచ్ మైబూషమ్మ, రైతులు తదితరులు ఉన్నారు.


