వనపర్తి: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో బీఎల్‌ఏ–2లే కీలకమని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా, పట్టణ, మండల అధ్యక్ష, కార్యవర్గసభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని క్షేత్రస్థాయిలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను వివరించారు. గ్రామాల్లోని ప్రతి కార్యకర్తను అక్కున చేర్చుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్‌లో వచ్చే ఏ ఎన్నికలైనా ఫలితాలు కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా ఉండేలా పని చేయాలని, ప్రత్యర్థి నేతలను కంగు తినిపించే వ్యూహాలతో ముందుకు సాగాలని కోరారు. అప్పుడే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృత్తం అవుతాయన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని, వారి ప్రయత్నాలను తిప్పికొట్టాలని తెలిపారు. కార్యకర్తల నుంచి అధిష్టానం వరకు ప్రతిపక్షక్ష నాయకులు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు విమర్శలను ఖండించాలని సూచించారు. అనంతరం కొత్తకోట పట్టణ, మండల, మదనాపురం మండలాల అధ్యక్షులుగా ఎన్నికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, జిల్లా కార్యవర్గసభ్యులు ఐ.సత్యారెడ్డి, కోళ్ల వెంకటేష్, శరవంద, మన్యం, బి.కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, నాయకులు సహదేవుడు, దయాకర్‌రెడ్డి, రాంరెడ్డి, సుఖేందర్‌రెడ్డి, విష్ణు ముదిరాజ్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


