● సినీనటుడు విజయ్ దేవరకొండ పిలుపు
● 188 మంది
విద్యార్థులకు
ప్రోత్సాహక
స్కాలర్‌షిప్స్ చెక్కుల పంపిణీ
బల్మూర్: తల్లిదండ్రుల్లోని మంచి నడవడికనే పిల్లల క్రమశిక్షణకు దోహదపడుతుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆదివారం ఆయన స్వగ్రామం తుమ్మెన్‌పేటలో స్కాలర్‌షిప్స్ చెక్కులను ఆయన సతీమణి రష్మిక, కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈఓ రమేష్‌కుమార్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. దీని వెనక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం విద్య కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమించి రూ.వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదివి వారి కలలను సాకారం చేయాలని సూచించారు.
నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా పుట్టిన ఊరిపై మమకారంతో పేద విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్‌షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ నిజమైన శ్రీమంతుడు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడానికి.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను నిర్మించాలని ఎమ్మెల్యే విజయ్ దేవరకొండను కోరారు.
‘ఈ రోజు రష్మిక దేవరకొండలా మీతో.. మీ ముందు మాట్లాడుతున్నా.. జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం.. కానీ, ప్రతి అనుభవం నుంచీ నేర్చుకుంటూనే ఉంటాం’.. అని పేర్కొన్నారు. విద్యార్థులంతా మంచి విషయాలు నేర్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని రష్మిక సూచించారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ తాను ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేశానన్నారు. విద్యార్థులు చేడు మార్గం వైపు చూడకుండా తల్లిదండ్రులు, గురువులు వారిని కనిపెట్టుకొని ఉండాలని కోరారు.


