ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

Jun 15 2026 12:41 AM | Updated on Jun 15 2026 12:41 AM

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

పాన్‌గల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్‌ కోరారు. ఆదివారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో భీమయ్య అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక చట్టాలను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, రైతులు, కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో పాలమూరులో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలకు ప్రతి గ్రామం నుంచి వందల సంఖ్యలో కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ధాన్యం సేకరణ

పూర్తి చేయాలి..

మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వరి ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని తెల్లరాళ్లపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్‌తో కలిసి సందర్శించారు. ధాన్యం సేకరణలో జాప్యం, సేకరించిన ధాన్యం బస్తాల తరలింపులో అలసత్వం కారణంగా అకాల వర్షాలకు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ జంబులయ్య, కృష్ణయ్య, భీమయ్య, సాయిలు, శ్రీరాములు, శేఖర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement