అదనపు భారం..! | - | Sakshi
Sakshi News home page

అదనపు భారం..!

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకే ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

ఖాళీగా 20 జీహెచ్‌ఎం పోస్టులు

గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

పట్టించుకోని పాలకులు, అధికారులు

జీహెచ్‌ఎంలు కరువు..

జిల్లాలోని 20 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు కరువుయ్యారు. దీంతో ఆయా పాఠశాలల్లోని సీనియర్లకే బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఇందులో సుమారు 10 ఉన్నత పాఠశాలల పరిధిలో స్కూల్‌ కాంప్లెక్స్‌ సముదాయాలు ఉన్నాయి. ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌లో 10 నుంచి 20 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉంటాయి. ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడం, వారితో సమావేశాలు నిర్వహించడం, పాఠశాల పురోగతిపై స్కూల్‌కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ (హైస్కూల్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడు) నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కొరవడటంతో గతేడాది కొత్తకోట స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో బినామీ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించడం కలకలం రేపింది. పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న తరుణంలో ఉపాధ్యాయవర్గాల్లో ఈ అంశం జోరుగా చర్చ జరుగుతుంది.

జిల్లావ్యాప్తంగా ఖాళీగా మండల విద్యాధికారి పోస్టులు

డీఈఓ

కార్యాలయం

వనపర్తిటౌన్‌: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడం, ప్రైవేట్‌ పాఠశాలలు ఏ మేరకు నిబంధనలు అమలు చేస్తున్నాయో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లాలో మండల విద్యాధికారులు కరువయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఈఓ ప్రతి వారానికి రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఒక ప్రైవేట్‌ పాఠశాల తనిఖీ చేయాల్సి ఉంది. జిల్లా ఏర్పాటుగాకముందు నుంచి ఇప్పటి వరకు ఎంఈఓల నియామకం చేపట్టకపోవడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 మండలాలు ఉండగా.. ఒక్క మండలానికి కూడా రెగ్యులర్‌ ఎంఈఓ లేకపోవడంతో సీనియర్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కనీసం జిల్లాకేంద్రమైన వనపర్తి మండలానికి సైతం ఎంఈఓ లేకపోవడం గమనార్హం.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

జిల్లాలో రెగ్యులర్‌ ఎంఈఓల కొరత ఉంది. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలతో ముందుకు సాగుతాను. ఈ అంశాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఇన్‌చార్జ్‌ ఎంఈఓలు మరింత మెరుగ్గా పని చేసేలా చేస్తాం.

– యాదయ్య, ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి

● జిల్లాలో 335 ప్రాథమిక పాఠశాలలు, 60 ప్రాథమికోన్నత పాఠశాలలు, 101 జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 55 వేల నుంచి 60 వేల మంది విద్యార్థులు ఏటా విద్యనభ్యసిస్తున్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ప్రతి మండలానికి మండల విద్యాధికారి పోస్టు ఉండగా, ఖాళీగా ఉండటంతో పర్యవేక్షించే వారు కరువయ్యారు. ఎంఈఓలుగా బాధ్యతలు చేపడుతున్న ప్రధానోపాధ్యాయుల పాఠశాలలు హైస్కూల్స్‌ కావడంతో అక్కడ అంతా చూసుకోవడం, ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా మారింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో పాఠశాలలను పర్యవేక్షించే ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో మారుమూల గ్రామాల్లో బడుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారనుంది. ఎస్జీటీలకు పదోన్నతి కల్పిస్తే ఎస్‌ఏలుగా.. ప్రధానోపాధ్యాయులు పదోన్నతి పొందితే ఎంఈఓలుగా భర్తీ కానున్నారు. పదోన్నతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఎంఈఓల పోస్టుల కొరత వేధిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తోందని, తెలంగాణలో అమలు చేయకపోవడంతో ఉపాధ్యాయులు నష్టపోవాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement