నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లోని పది మండలాల పరిధిలో రూ.4,885 కోట్ల వ్యయంతో లక్ష ఎకరాలకు పైగా సాగు, 123 గ్రామాలకు తాగు నీరందించే లక్ష్యంగా ఎంఎన్‌కేఎల్‌ఐ పథకం పనులు చేపట్టారు. మొత్తం మూడు విడతలు కాగా.. మొదటి దఫా పనులు ఊపందుకున్నాయి. స్టేజీ–1లో మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్‌హౌస్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్‌గోడు, కచ్చార్ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు కాల్వల పనులు కొనసాగుతున్నాయి.
ప్రధానంగా భూ పరిహారంలో దామరగిద్ద మండలం కానుకుర్తిలో గందరగోళం నెలకొంది. పరిహార జాబితాలో పలువురు రైతుల పేర్లు లేకపోవడం వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కొడంగల్ ప్రాజెక్ట్‌లో ఆ గ్రామంలోని సర్వే నంబర్ 393, 401/1లో దాదాపు 10.4 ఎకరాల భూమికి సంబంధించి చిక్కుముడులు నెలకొన్నాయి. ఇనాం భూమిలని సదరు రైతులు చెబుతుండగా.. రికార్డుల్లో దేవుడి మాన్యం కింద ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పరిహారం జాబితాలో ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు గల్లంతు కావడం సమస్యగా మారింది. దీంతో పలువురు రైతులు ఇటు అధికారులు, అటు ఎమ్మెల్యే, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతుల్లో ఆందోళన, పరిహారం చిక్కుముడులపై రెవెన్యూ అధికారులను సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు.
చిక్కుముడులతో గందరగోళం..
అందని పరిహారం.. చాటింపుతో ఆందోళన
కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించి మొత్తం 2,736.10 ఎకరాల భూమి సేకరించారు. ఇందులో ఇప్పటివరకు 1,346.04 ఎకరాలకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షల చొప్పున రైతులకు మొత్తంగా రూ.269 కోట్లు అందజేశారు. ఇంకా 975 ఎకరాలకు పరిహారం అందించాల్సి ఉంది. అయితే నారాయణపేట మండలం పేరుపళ్ల గ్రామంలోని జాయమ్మ చెరువు వద్ద పంప్ హౌస్ నిర్మాణంలో 345 మంది రైతులకు చెందిన దాదాపు 400 ఎకరాలు భూసేకరణలోకి వెళ్లనున్నాయి. ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. ఆ డబ్బులు రైతులకు అందలేదు. నష్టపరిహారం చెల్లించకుండానే.. ఆయా భూముల్లో రైతులు పంటలు వేయొద్దంటూ అధికారులు ఇటీవల గ్రామంలో చాటింపు వేయించడంతో దుమారం చెలరేగింది. పరిహారం ఇవ్వకుండా ఎలా స్వాదీనం చేసుకుంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు.పరిహారం పూర్తిగా ఇచ్చే వరకూ భూములను వదులుకునేది లేదని.. అప్పటివరకు సాగు చేస్తామని చెబుతున్నారు. పేరుపళ్లలో చాటింపు వేసిన క్రమంలో సమీప ప్రాంతాలకు చెందిన భూ నిర్వాసితుల్లోనూ ఆందోళన నెలకొంది. పంటలు వేయాలా.. వేయొద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు.


