ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు సరికాదు

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

వనపర్తి: వరి ధాన్యం కేటాయింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడుతున్న జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్‌ఓ) కాశీవిశ్వనాథ్‌పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రాచాల యుగంధర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని రాజనగరం శివారులో ఉన్న బసవేశ్వర రైస్‌మిల్లును జేఏసీ నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో డీఎస్‌ఓ అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. కస్టోడియన్‌గా ఉన్న మిల్లులో రూ.కోట్ల విలువైన ధాన్యం మాయమవడం, మరో రైస్‌మిల్లుకు భారీగా ధాన్యం కేటాయించి అందులోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. తాజాగా బసవేశ్వర రైస్‌మిల్లు విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. రూ.5 లక్షల బ్యాంకు గ్యారంటీ మాత్రమే సమర్పించిన మిల్లుకు ఏకంగా రూ.7 కోట్లకుపైగా ధాన్యం కేటాయించడం వెనుక కారణాలు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అనేక మంది మిల్లర్లు ధాన్యం కేటాయింపుల కోసం విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక మిల్లర్లను పక్కనబెట్టి ఇతర జిల్లాలకు ధాన్యం కేటాయించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎస్‌ఓ వ్యవహార శైలిపై కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జిల్లాలో చోటు చేసుకున్న ధాన్యం కేటాయింపుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న అధికారులను రక్షించకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. డీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్‌ను సస్పెండ్‌ చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్‌, కృష్ణప్రసాద్‌, మోహన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement