నాణ్యమైన వరి ధాన్యం తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వరి ధాన్యం తీసుకురావాలి

May 11 2026 7:20 AM | Updated on May 11 2026 7:20 AM

వనపర్తి: రైతులు తాలు, చెత్త లేకుండా నాణ్యమైన వరి ధాన్యం కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. ఆదివారం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్‌, వ్యవసాయ, కో–ఆపరేటివ్‌, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐకేపీ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించి సమీక్షించారు. రైస్‌మిల్లర్లు ధాన్యం త్వరగా దించుకోకపోవడంతో రోజుల తరబడి లారీలు ఆగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తూకం చేయకపోవడం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తాలు, చెత్త ఎక్కువగా ఉండటంతో ఎఫ్‌సీఐకి నాణ్యమైన బియ్యం తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం తీసుకొచ్చేలా చూడాలని మిల్లర్లు కలెక్టర్‌కు వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ రైతులు సహకరించి తూర్పారబట్టిన వడ్లను కేంద్రానికి తీసుకురావాలని, నాణ్యమైన ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. సేకరించిన ధాన్యం ట్యాబ్‌ఎంట్రీలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లు వచ్చిన లారీలను త్వరగా ఖాళీ చేసి పంపించాలని, రోజుల తరబడి మిల్లుల వద్ద నిలుపుకోవద్దని సూచించారు. కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడిసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి యాసంగి కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీఓ రాణి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

Advertisement
 
Advertisement
Advertisement