చెరుకు తరలింపునకు సహకరించాలని వినతి
ఆత్మకూర్: చెరుకు తరలింపునకు పోలీసుల ఆంక్షలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఎత్తివేసి సహకరించాలని కృష్ణవేణి చెరకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో రైతులు శనివారం ఎస్‌ఐ జయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరచింత, ఆత్మకూర్ మండలాల నుంచి కృష్ణవేణి చెక్కర ఫ్యాక్టరీకి నిత్యం వందల సంఖ్యలో చెరుకు ట్రాక్టర్లు, లారీలు వెళ్తుంటాయన్నారు. ఆయా వాహనాల రాకపోకలతో మదనాపురం, ఆత్మకూర్‌లో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని పోలీసులు రాత్రి వరకు నిలుపుతున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమయపాలన ఆంక్షలు ఎత్తివేసి నిరంతరం రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, సంజీవరెడ్డి, నారాయణ, వెంకటేష్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


