కాంగ్రెస్‌లో పంచాయితీ..!
మార్పు వచ్చేనా..?
మక్తల్‌లో ‘ఆత్మకూర్’ దుమారం..
జడ్చర్లలో అసహనం.. ఆగ్రహం
పేలుతున్న నేతల మాటల తూటాలు
● వనపర్తిలో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
● మంత్రి వాకిటి ఇలాకాలోనూ మంటలు
● సామాజిక మాధ్యమాల్లోనూ ఇరువర్గాల పోరు
● వైరల్‌గా మారిన పలు పోస్టులు..
● జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. అధికార కాంగ్రెస్‌లో సం‘గ్రామం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘రెబల్స్’తో రాజుకున్న సెగ దావానలంలా ఎగిసిపడుతోంది. గెలుపును ప్రభావితం చేసిన తిరుగుబాటుదారులు.. ఓడిపోయిన వర్గాల మధ్య పోరు ఆ పార్టీ ముఖ్య నేతలను రచ్చకీడుస్తోంది. మరోవైపు కీలక బాధ్యతల్లో ఉన్న పెద్దలు సంయమనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తుండడం.. స్వపక్షంలోని నాయకులపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండడం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ప్రధానంగా వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పేలుతున్న మాటాల తూటాలు ఉమ్మడి పాలమూరులో హాట్ టాపిక్‌గా మారాయి.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గెలపొందిన కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా మాట్లాడుతూ చేపలు గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయిన పలు గ్రామాల ప్రజలను బాహాటంగా తూర్పారబట్టడం విమర్శలకు దారితీసింది. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఇదంతా జరగగా.. కనీసం ఆయన వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ క్రమంలో తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం.. సొంత మండలం రాజాపూర్‌లో బీఆర్‌ఎస్ సత్తా చాటడంతో ఆయనలో అసహనం.. ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు, వర్గాలు సామాజిక మాధ్యమాలు వేదికగా పోరు సాగిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం వారివారి వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా నాపై, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి. కాంగ్రెస్ విధేయులుగా, జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటి?’ అని చిన్నారెడ్డిపై ప్రెస్‌మీట్‌లో పరోక్షంగా విమర్శలు చేయడం దుమారం రేపాయి. ప్రతిగా చిన్నారెడ్డి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వైరల్‌గా మారగా.. నియోజకవర్గం అట్టడుకుతోంది.
వనపర్తి
పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్నా.. సర్పంచ్ స్థానాల్లో గెలవకపోవడంపై ఉమ్మడి పాలమూరులోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపాన్ని సైతం వారికి ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులు, అనుచరులకు పార్టీ తరఫున మద్దతిచ్చి నిలబెట్టడం ‘రెబల్స్’ బరిలో ఉండేందుకు ఆస్కారమిచ్చిందని.. దీంతో ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి కలిసి వచ్చిందంటూ ఉదాహరణలతో వారిని ఎండగట్టినట్లు సమాచారం. వచ్చేవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు.. జాగ్రత్తగా వ్యవహరించాలని.. డీసీసీలు సైతం పక్కా కార్యాచరణతో విజయం సాధించేలా శ్రమించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఎవరెవరికి చీవాట్లు పెట్టారు.. ఇప్పటికై నా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మార్పు వచ్చేనా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.


