రాజీమార్గం.. రాజమార్గం
వనపర్తిటౌన్: కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో 9,969 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇందులో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 1,701, ప్రీ లిటిగేషన్ కేసులు 8,268 ఉన్నాయన్నారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
84 కేసులు పరిష్కారం..
ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్‌ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శిరీష మాట్లాడుతూ.. క్షణికావేశంలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరగడంతో విలువైన సమయం వృథా అవుతుందన్నారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం 46 క్రిమినల్, 3 ఎకై ్సజ్, 2 ఎస్టీసీ, 10 సీసీ అడ్మీషన్ కేసులకుగాను రూ.43,500.. 23 డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ. 22,500 జరిమానా విధించారు. మొత్తం 84 కేసులు పరిష్కరించి కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది, ఆయా మండలాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి
నాగర్‌కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామన్నారు. పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, అభద్రత భావం, నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ పాల్గొన్నారు.
రాజీమార్గం.. రాజమార్గం
రాజీమార్గం.. రాజమార్గం


