గాంధీజీ ఆశయ సాధనకు కృషి
● దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ
● డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి
● గాంధీచౌక్‌లో కాంగ్రెస్ నిరసన
వనపర్తిటౌన్: గాంధీజీ ఆశయ సాధనకు దేశ ప్రజలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధిహామీ పథకం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేశారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం అభాగ్యులకు ఎంతగానో ఉపయోగపడుతోందని, గ్రామీణ ప్రజలు ఉద్యమించేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సామాన్య ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పేదల సంక్షేమానికి యత్నిస్తుండగా.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధనవంతులను పెంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశ సంపదంతా అదానీ, అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని.. ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇటీవల జరిగిన అక్రమ కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నందిమళ్ల యాదయ్య, శంకర్‌ప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, నాయకులు కదిరె రాములు, బి.కృష్ణ, తిరుపతయ్య, బాబా, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.


