ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
గోపాల్‌పేట: గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని ఎస్‌ఈ వెంకట్రామన్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆయనతో పాటు శాఖ అధికారులు పర్యటించి నీటి సరఫరాపై ఆరా తీశారు. మిషన్ భగీరథ మంచినీరు సరిగా రావడం లేదని, బోరు నీటినే పైప్‌లైన్ ద్వారా వదులుతున్నారని రేవల్లిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అందరికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
జీ రామ్‌జీ బిల్లు
రద్దు చేయాలి : సీపీఎం
కొత్తకోట: లోక్‌సభలో బలవంతంగా ఆమోదించిన జీ రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కొనసాగించాలని సీపీఎం జిల్లా ప్రధానకార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఏ పాలనలో వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా, అధికార దురహంకారంతో పేర్లు మార్చి కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు రోజువారి వేతనం రూ.600కు పెంచాలని, పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, నాయకులు వెంకటయ్య, గొల్ల రాములు, యాదయ్య, మల్లేష్, నాగన్న, కురుమయ్య, వెంకటేష్, గోపాల్, శ్రీను, రాములు, గోవర్దన్, మహేష్ పాల్గొన్నారు.
ఎన్నికలను డబ్బు, మద్యం శాసిస్తున్నాయి : సీపీఐ
అమరచింత: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను ప్రస్తుతం డబ్బు, మద్యం, కులమతాలు ప్రధానపాత్ర పోషిస్తూ శాసిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి రాజకీయ నాయకులు తిలోదకాలు ఇచ్చారని.. యథేచ్ఛగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే వామపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే జంకే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోందని.. నల్ల చట్టాలు, ఉపాధిహామీ పథకం పేరు మార్పు ఇందులో ఉన్నాయన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని సత్కరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్, కళావతమ్మ, లక్ష్మీనారాయణశెట్టి, శ్రీహరి, శ్యాంసుందర్, కుతుబ్, నర్సింహశెట్టి పాల్గొన్నారు.
రామన్‌పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా 975 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 60 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు


