గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ నెల 23న జిల్లా పర్యటనకు రానున్నారని.. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గవర్నర్ పర్యటనకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23వ తేదీన 3.30 గంటలకు గవర్నర్ జిల్లాకేంద్రానికి చేరుకొని జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖుల ముఖాముఖిలో పాల్గొంటారని, వారందనీ ఆహ్వానించాలని ఆర్డీఓ సుబ్రమణ్యంకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, వేదిక, సౌండ్ సిస్టం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వ హణకు తగిన ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీని ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా విద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వాహనదారులు రహదారి భద్రత నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని.. విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపార. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు రహదారి నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తోందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి మాసోత్సవాలను విజయవంతం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ దేశ్యానాయక్, డీటీఓ మానస, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, పంచాయత్‌రాజ్‌శాఖ ఈఈ మల్లయ్య, ఐఆర్‌ఏడీ డీఆర్‌ఎం మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


