ఖర్చు లెక్క పక్కాగా నమోదు చేయాలి
పాన్‌గల్: గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు చేస్తున్న ఖర్చును పక్కాగా నమోదు చేసి రికార్డులను అందించాలని, లేనిచో బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల వ్యయ నిబంధనలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఖర్చుల వివరాలు, బిల్లులు, ఓచర్లతో సహా ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో సమర్పించాలని, అందించకుంటే భవిష్యత్‌లో ఏ ఇతర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్ ఆడిటర్ లాలయ్య, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


