ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు

Dec 9 2025 10:49 AM | Updated on Dec 9 2025 10:49 AM

ప్రలో

ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు

జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు, క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలు వంద గుర్తించి వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం. మరికొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లను నియమించి ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. జిల్లాలో 96 రూట్లు ఉండగా.. ఆయా ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌టీ బృందాల పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేశాం.

వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని.. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసినా.. ఓటు వేసేందుకు ఒత్తిడి తీసుకొచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు షెడ్యూల్‌ ప్రకారం పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..

రెండు విడతల ప్రక్రియ పూర్తి..

జిల్లాలో 268 సర్పంచ్‌, 2,436 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు కొనసాగుతుండగా.. రెండువిడతల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు 10 సర్పంచ్‌, 252 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడత నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఏకగ్రీవమైన సర్పంచ్‌, వార్డు స్థానాల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. జిల్లాస్థాయి కమిటీ విచారణ చేసి సంతృప్తి చెందితే.. ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రక్రియ ముందుకుసాగుతోంది.

మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు..

ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. మధ్యాహ్నం రెండు నుంచి స్టేజ్‌–2 ఆర్‌ఓ నిర్ణయం మేరకు సిబ్బందితో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందజేస్తారు. 50 శాతం కోరం ఉంటేనే ఉపసర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు.

దొంగ ఓట్లేస్తే జైలుకే..

ఎవరైనా ఇతరుల ఓటు వేసేందుకు యత్నిస్తే పోలింగ్‌ కేంద్రం నుంచి నేరుగా జైలుకు పంపిస్తాం. టెండర్డ్‌ ఓట్లు, ఛాలెంజ్‌ ఓట్లు వేసేందుకు పీఓలు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేస్తారు.

గుర్తింపు కార్డులు తప్పనిసరి..

ప్రతి ఓటరు స్లిప్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు లేకుంటే ఓటు వేసేందుకు అనుమతించరు.

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు..

ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు కల్పించాం. దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, మల్టీపర్పస్‌ వర్కర్లను నియమించాం. ఆరోగ్యశాఖ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారు. జిల్లాలో అంధులు, అశక్తుల జాబితాలోకి వచ్చే ఓటర్లు సుమారు 4,500 వరకు ఉన్నారు. వీరు పీఓ అనుమతితో సహాయకుడిని తీసుకెళ్లవచ్చు. పీఓలు సహాయకులుగా వ్యవహరించరు. రాజకీయ నాయకులకు అవకాశం ఉండదు.

పోలీసులకు అనుమతి లేదు..

కేంద్రాల వద్ద గస్తీ నిర్వహించే పోలీసులుకు సైతం కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి లేదు. జిల్లా అధికారులు, నోడల్‌ అధికారులు, ఓటర్లు మినహా ఎవరినీ లోపలికి అనుమతించరు.

జాగ్రత్తగా ఓటు వేయాలి

ప్రతి బ్యాలెట్‌ పేపర్‌ పీఓ సంతకంతో జారీ చేస్తారు. ఒక ఓటరుకు సర్పంచ్‌, వార్డుసభ్యుడి బ్యాలెట్‌ పేపర్లు ఇస్తారు. గులాబీరంగు బ్యాలెట్‌ పేపర్‌ సర్పంచ్‌ స్థానానికి, తెల్లరంగు బ్యాలెట్‌ పేపర్‌ వార్డుసభ్యుడిని ఎంచుకునేందుకు ఉంటాయి. ఓటువేసే సమయంలో జాగ్రత్తగా పూర్తి ముద్ర పడేలా వేయాలి. రెండు, మూడుచోట్ల వేస్తే చెల్లని ఓటుగా పరిగణిస్తారు.

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి

‘సాక్షి’తో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

సిబ్బంది కేటాయింపు..

ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని ఎంపిక చేసి రెండు పర్యాయాలు శిక్షణ పూర్తి చేశాం. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పీఓ, 200 మంది ఓటర్లకు ఒక ఓపీఓ చొప్పున కేటాయించాం. ఖిల్లాఘనపురం, శ్రీరంగాపురం మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో గరిష్టంగా 500 నుంచి 600 మంది ఓటర్లు ఉండటంతో అక్కడ ముగ్గురు ఓపీఓలను నియమించాం. తొలివిడతకు 936 మంది పీఓలు, 1,189 ఓపీఓలు, రెండోవిడతకు 1,020 మంది పీఓలు, 1,273 ఓపీఓలు, మూడోవిడతలో 968 మంది పీఓలు, 1,271 ఓపీఓలను కేటాయించాం.

సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌..

ఓటర్లను తరలిస్తే చర్యలు..

ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి రహస్య ప్రదేశాల్లో దాచి పోలింగ్‌ కేంద్రాలకు నిర్బంధంగా తరలిస్తే చర్యలు తప్పవు. మద్యం, డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఓటరు హక్కును హరించేలా ప్రవర్తిస్తే సహించేది లేదు.

ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు 1
1/1

ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement