ఆరుతడికే సాగునీరు
యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు
●
చివరి వరకు అందించాలి..
యాసంగి సీజన్‌లోనూ వరిపంట పండించేందుకు వీలుగా నీటి సరఫరా చేయాలి. కేవలం మొక్కజొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలకే నీరందిస్తే మేం తీవ్రంగా నష్టపోతాం. కాల్వల వెంట నీరు వృథా కాకుండా మరమ్మతు చేపట్టాలి. చివరి దశలో పంటలు ఎండిపోకుండా ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయాలి.
– ఆలేటి మారయ్య, గట్టురాయిపాకుల,
తెలకపల్లి మండలం
రిజర్వాయర్లు నింపుతాం..
కేఎల్‌ఐ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం సాగునీరు సరఫరా చేస్తాం. ఇందుకోసం ముందుగా జిల్లాలోని ప్రధానమైన సాగునీటి రిజర్వాయర్లను నింపుతాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తూ యాసంగి పంటలకు నీటి సరఫరా చేపడతాం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్‌లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే
(పంట విరామం) ప్రకటించారు.
అత్యధికంగా కేఎల్‌ఐ..
ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్‌లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్‌సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు.
ప్రాజెక్టు మొత్తం ప్రతిపాదిత ఆరుతడి వరి
ఆయకట్టు ఆయకట్టు పంటలు
కేఎల్‌ఐ 3,70,469 2,81,754 2,01,317 80,437
కోయిల్‌సాగర్ 35,600 7,700 7,700 –
భీమా లిఫ్ట్–1 82,523 21,690 21,690 –
భీమా లిఫ్ట్–2 92,000 10,000 5,350 4,650
జూరాల 1,09,296 26,924 20,014 6,910
నెట్టెంపాడు 1,42,000 22,800 22,800 –
ఆర్డీఎస్ 83,998 – – –
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి ప్రణాళిక వివరాలు (ఎకరాల్లో)
వారబందీ విధానంలో నీటి విడుదలకు నిర్ణయం
కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్‌ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు..
ఆర్డీఎస్ పరిధిలో పంట విరామం ప్రకటన
ఆరుతడికే సాగునీరు


