బాధ్యతలు చేపట్టిన విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
వనపర్తిటౌన్: జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా వి.తిరుపతిరావు సోమవారం ఎస్‌ఈ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు పనిచేసిన ఎస్‌ఈ రాజశేఖరం హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో జోగుళాంబ గద్వాల జిల్లా డీఈగా విధులు నిర్వర్తించే తిరుపతిరావు పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎల్పీఓ (లోకల్ పర్చేజ్ ఆర్డర్)లో అవకతవకతలు చోటు చేసుకోకుండా దృష్టి సారిస్తామని, క్షేత్రస్థాయిలో లోటుపాట్లు ఉంటే సరిచేస్తామన్నారు. కొత్తకోట, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడంతో పాటు అవసరమైన చోట స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 133, 11కేవీ విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తామని వివరించారు.
అధికారుల ఆకస్మిక తనిఖీ
గోపాల్‌పేట: ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మండల కేంద్రంతో పాటు రేవల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాలను స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఏదుల కేంద్రాన్ని ఆర్డీఓ సుబ్రహ్మణ్యం తనిఖీ చేసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లు, సామగ్రి పంపిణీ, రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో అధికారులు ఉండాల్సిన తీరు, ఏ అధికారి తర్వాత ఏ అధికారి ఉండాలి.. అవసరమైన సామగ్రిని ప్రతి ఒక్కరికీ అందించాలని సూచించారు. గోపాల్‌పేట మండలంలో 44 మంది, ఏదులలో 76 మంది, రేవల్లి మండలంలో 24 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను వినియోగించుకున్నారని ఆయా మండలాల అధికారులు తెలిపారు.
నిండుకుండలా
రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా 390 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 700 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 564 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
అలజడులు
సృష్టిస్తే చర్యలు
ఆత్మకూర్: ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అలజడులు సృష్టిస్తే చట్టపరమైన శిక్షలు తప్పవని సీఐ శివకుమార్, ఎస్‌ఐ జయన్న హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం మండలంలోని పిన్నంచర్లలో జిల్లాపరిధిలోని ఎస్‌ఐలు, ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులతో గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని, గొడవలకు తావివ్వొద్దని కోరారు.
బాధ్యతలు చేపట్టిన విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
బాధ్యతలు చేపట్టిన విద్యుత్‌శాఖ ఎస్‌ఈ


