ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం తగదు
వనపర్తి: కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, రైస్‌మిల్లుల్లో నూర్పిళ్లు, రైతులకు డబ్బుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం సేకరణ, మిల్లింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆయన సోమవారం పలు రైస్‌మిల్లులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. చిట్యాల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే గ్రామంలోని లక్ష్మీనర్సింహ రైస్‌మిల్‌ను తనిఖీచేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా వెంటనే ట్రక్‌షీట్లు రూపొందించి ధ్రువీకరణ పత్రం అందించాలని యాజమాన్యానికి సూచించారు. పెద్దమందడి మండలం వీరాయిపల్లిలోని మల్లికార్జున రైస్‌మిల్‌ను డిఫాల్ట్‌గా నమోదు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న ధాన్యాన్ని సమీప మిల్లుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఖిల్లాఘనపురం మండలంలోని తిరుమల ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ ఆగ్రోటెక్ రైస్‌మిల్లులో ధాన్యం అనన్‌లోడింగ్, మిల్లింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్ తదితరులు ఉన్నారు.


