ఖర్చు లెక్క పక్కాగా చూపాలి
ఆత్మకూర్/వనపర్తి రూరల్/అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తాము చేస్తున్న ఖర్చుల లెక్కలను పక్కాగా ఎన్నికల పరిశీలకులకు అందించాలని.. లేనిపక్షంలో బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆత్మకూర్, అమరచింత ఎంపీడీఓ కార్యాలయాల్లో సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు ఎన్నికల వ్యయ నిబంధనలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని.. లెక్కల వివరాలు, బిల్లులు, ఓచర్లతోసహా సమర్పించాలని సూచించారు. గెలుపు, ఓటములకు సంబంధం లేదని.. పోటీ చేసే ప్రతి అభ్యర్థి లెక్కలు పూర్తి ఆధారాలతో చూపిచాల్సిందేనని, లేనిపక్షంలో వేటు తప్పదని స్పష్టం చేశారు. ఆత్మకూర్‌లో జరిగిన అసిస్టెంట్ అబ్జర్వర్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, అమరచింతలో జరిగిన కార్యక్రమంలో ఎంపీఓ నర్సింహులు పాల్గొన్నారు.
● వనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రికార్డులను ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఎన్నికల వ్యయం పరిమితి, చేసిన ఖర్చును రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఖర్చును మూడుసార్లు పరిశీలిస్తామని వివరించారు.


