వ్యాపార అభివృద్ధికి రుణాలు
వనపర్తిటౌన్: కాలానికి అనుగుణంగా ట్రెండింగ్‌లో ఉన్న వ్యాపారాలు, తయారీరంగాల ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తామని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ సునీత తెలిపారు. సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల ఆర్థిక అవసరాలు తెలుసుకోవడానికి ఎంఎస్‌ఎంఈ సందర్శనలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలో బ్యాంకు అధికారులు, సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వ్యాపారులు ఎలా నడుస్తున్నాయి.. ఆర్థికంగా ఊతమిచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గతంలో కొనసాగుతున్న వ్యాపారానికి భిన్నంగా ఏదైనా ఆలోచిస్తున్నారా? రోజు, నెలవారీ ఆదాయం ఎంత తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ట్రెండింగ్, తయారీ రంగాలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త విధానంతో జీఎస్టీ, ఐటీ రిటర్న్స్ సకాలంలో దాఖలు చేస్తే రుణ పరిమితి ఎంత వరకు ఉందో గంటల్లోనే వ్యాపారులకు తెలుస్తుందని చెప్పారు. ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే రుణాల కోసం ఎలాంటి సిఫార్సులు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. వ్యాపార అభివృద్ధికి తగినట్లుగా రుణాలు పొందేందుకు వ్యాపారులు చొరవ చూపాలని కోరారు. ఆమె వెంట మెయిన్ బ్రాంచ్ ఛీప్ మేనేజర్ రవీంద్రకుమార్, ఎస్‌బీఐ ఏడీబీ చీఫ్ మేనేజర్ కృష్ణమూర్తి, ఫీల్డ్ అధికారులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


