‘రూ.25 లక్షల పరిహారమిస్తే తప్పుకొంటాం’
ఖిల్లాఘనపురం: ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ మేరకు గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారమిస్తే సర్పంచ్ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మండలంలోని గట్టుకాడిపల్లి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గట్టుకాడిపల్లి, ఖిల్లాఘనపురంలో కాసేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్ల కిందట ఖిల్లాఘనపురం ఎలా ఉండే.. నేడు ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించడంతో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, సర్పంచ్ అభ్యర్థి క్యామ అజంతా, పలువురు నాయకులు పాల్గొన్నారు.


