పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
వనపర్తి: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌పై సంబంధిత పీఓ, ఏపీఓల శిక్షణకు ఆయనతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్యబట్టు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. డిసెంబర్ 8న మొదటి విడత మండలాలకు, 12వ తేదీన రెండోవిడత మండలాలకు, డిసెంబర్ 15న మూడోవిడత మండలాలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుందని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఫారం 14 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలన్నారు. ఓటు వేయడానికి వచ్చే సిబ్బంది గుర్తింపు కార్డును విధిగా తనిఖీ చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో శిక్షకులు శ్రీనివాసులు, డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నోడల్ అధికారి అంజయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


