ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలి
వనపర్తి: వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, డీఎంసీఎస్‌లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లింపులను ఆలస్యం చేయకుండా వెంటనే జమ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ప్రవేశించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు వానాకాలం సీఎంఆర్ గడువులోగా అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగి సీఎంఆర్ అప్పగింతకు ఫిబ్రవరి వరకు గడువు పొడిగించినందున పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


