నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
వనపర్తిటౌన్: పట్టణంలోని 33 కేవీ ఉపకేంద్రంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఏఈ సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలోని బాలానగర్, డిగ్రీ కళాశాల రోడ్, మెటర్నిటీ చిల్డ్రన్ ఆస్పత్రి, అప్పాయపల్లి రోడ్, నందిమళ్లగడ్డ, వశ్యనాయక్‌తండా, పాతబజార్, కుమ్మరిగేరి, సవరంగేరి, కమలానగర్, గాంధీనగర్, రాయిగడ్డకాలనీ, రాంనగర్‌కాలనీ, బ్రహ్మంగారివీధి, శారదనగర్ కాలనీ, చిట్యాలరోడ్, శ్వేతానగర్, తిరుమలకాలనీ, వల్లభ్‌నగర్, పీర్లగుట్ట, బండారునగర్, పానగల్ రోడ్, గాంధీచౌక్, భగత్‌సింగ్‌నగర్, మెట్‌పల్లి, చిన్నగుంటపల్లి ఫీడర్, గోపాల్‌పేట్ ఫీడర్, రాజాపేట ఫీడర్‌లోని ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులు సహకరించాలని కోరారు.
పౌరసరఫరాలశాఖలో చేతివాటం?
● ఆన్‌లైన్ చెల్లింపులు చేసినట్లు
మిల్లర్ ఫిర్యాదు
వనపర్తి: జిల్లా పౌరసరఫరాలశాఖ విభాగంలో ఆన్‌లైన్ చెల్లింపుల లొల్లి ముసలం పుట్టిస్తోంది. తన వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేశారని, ఆన్‌లైన్‌లో చెల్లించినట్లు ఇప్పటికే ఓ మిల్లర్ అధికారిపై కోర్డును ఆశ్రయించగా సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే.. తాజాగా గురువారం 2024, సెప్టెంబర్ నుంచి 2025, మార్చి 28 వరకు పలు దఫాల్లో రూ.55 వేలు పౌరసరఫరాలశాఖ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సిబ్బందికి ఆన్‌లైన్ చెల్లింపులు చేసినట్లు మరో మిల్లర్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ చేపడతారో వేచి చూడాల్సి ఉంది.
సామాజిక మాధ్యమాల్లో ‘కోల్డ్‌వార్’..
జిల్లా పౌరసరఫరాలశాఖలోని అధికారులు, సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి లోగుట్టును బయటపెడుతూ అనుకూలమైన వారితో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా అవినితీ ఆరోపణలు.. అక్రమాల విషయాలను బహిర్గతం చేస్తూ శాఖతో పాటు జిల్లా పరువు రచ్చకీడుస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
‘నిద్రావస్థలో వైద్య,
ఆరోగ్యశాఖ అధికారులు’
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక టీ–హబ్‌ను బీసీ సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ మాజీ ముఖ్యమంత్రి ఫొటోతోనే సేవల వివరాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయని విస్మయం వ్యక్తం చేశారు. బయో కెమిస్ట్రీ యంత్రం మరమ్మతుకు గురై మూడునెలలు గడుస్తున్నా నేటికీ బాగు చేయించలేదని, దీంతో వైద్య పరీక్షలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నా పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేశారు. టీ–హబ్ నిర్వాహకులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల వైఖరి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉందన్నారు. ఇప్పటికై నా స్పందించి రోగులకు అన్నిరకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జేఏసీ వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట, శ్రీరంగాపురం మండలాల అధ్యక్షులు అంజన్న, ధర్మేంద్రసాగర్, చెలిమిళ్ల రామన్‌గౌడ్ పాల్గొన్నారు.
మార్మోగిన
అంజన్న నామస్మరణ
దేవరకద్ర: మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అంజన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి ప్రభోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంపై ఊరేగించారు. అనంతరం ప్రభోత్సవ తేరులో స్వామివారు కొలువుదీరగా.. భక్తులు టపాసులు కాలుస్తూ రథాన్ని లాగారు.
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


