మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
వనపర్తి: ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణకు ఆయనతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్, ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలించడమే కీలకమని, పీఓలు, ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోరాదని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కొనసాగుతుందా లేదా అనేది పరిశీలించడం ప్రధాన బాధ్యతన్నారు. పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించి ఇచ్చిన ఫార్మట్‌లోనే నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఉదయం 6 గంటల వరకే నిర్దేశిత కేంద్రానికి చేరుకోవాలని, చెక్ లిస్ట్‌ను చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, ట్రైనర్ శ్రీనివాసులు, డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..
జిల్లాలో మొదటి విడత జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ డి.సునీతరెడ్డి, సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని వివరాలు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎల్పీఓ రఘునాథ్, సి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


