దొడ్డురకం మాకొద్దు..!
వరి ధాన్యం సేకరణకు మిల్లర్ల అనాసక్తి
బాయిల్డ్ మిల్లులకే..
వనపర్తి: రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత మిల్లర్లు సన్నాల సేకరణకే మొగ్గు చూపుతున్నారు. దొడ్డు రకం వరిధాన్యం సాగుచేసిన రైతులు దిగుబడుల విక్రయానికి కేంద్రాల్లో పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల కలెక్టరేట్ ప్రజావాణిలో రైతులు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా.. నేటికీ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభం కాలేదనే వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. మిల్లర్లు దొడ్డు రకం ధాన్యం తీసుకుంటే బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు. వారు నిబంధనలు కచ్చితంగా పాటిస్తుండటంతో నాణ్యతలో ఎలాంటి లోపాలున్నా.. అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం సీఎస్‌సీకి అప్పగించే సన్నబియ్యం రీసైక్లింగ్ చేసుకోవచ్చు.. సీఎంఆర్ పాస్ చేయడంలో టెక్నికల్ అసిస్టెంట్లు చూసీచూడనట్లు కానిచ్చేస్తుండటంతో మిల్లర్లు సన్నరకం వరి ధాన్యం దించుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అధికారులు సైతం మిల్లర్లకు సహకరిస్తున్నారనే వదంతులు ఉన్నాయి.
జిల్లాలో కొనుగోళ్లు ఇలా..
జిల్లావ్యాప్తంగా మొత్తం 433 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 376 మాత్రమే ప్రారంభమయ్యాయి. అందులో 251 సన్నరకం, 150 వరకు దొడ్డురకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సన్నరకం 91,088 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తే.. దొడ్డురకం కేవలం 7,700 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించడం గమనార్హం.
వానాకాలం సాగు వివరాలిలా..
జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 2.15 లక్షల ఎకరాల్లో సన్నరకం, 20,276 ఎకరాల్లో దొడ్డు రకం వరి ధాన్యం సాగైనట్లు వ్యవసాయశాఖ అఽధికారుల లెక్కలు చెబుతున్నాయి. సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా. నెల కిందట ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా.. తేమశాతం తగ్గించేందుకు ఆరబెడుతుండటంతో నెమ్మదిగా ప్రారంభమై పుంజుకుంటున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
● వనపర్తి మండలం అంకూరులో ఏర్పాటుచేసిన దొడ్డురకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం బీసీ సంఘం నాయకులు పరిశీలించగా.. రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సుమారు నెలరోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ సమస్యను కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు వివరించారు.
కొనుగోలు కేంద్రాల్లో
పేరుకుపోయిన నిల్వలు
కలెక్టరేట్‌కు చేరిన సమస్య..
ప్రజావాణిలో విపక్షాలు, రైతుల ఫిర్యాదు
జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు
చేసింది కేవలం 7,700 మె.ట.
దొడ్డురకం వరిధాన్యాన్ని ఎక్కువగా బాయిల్డ్ రైస్‌మిల్లులకు కేటాయించాల్సి ఉంటుంది. వారిలో బ్యాంకు గ్యారంటీలు సమర్పించి అర్హత ఉన్నవారు తక్కువగా ఉన్నారు. సన్నాలతో పాటు దొడ్డురకాలను పంపిస్తున్నాం. వానాకాలం ధాన్యంతో నష్టం వాటిల్లుతుందని మిల్లర్లు విముఖత చూపుతున్నారు. మిల్లర్లు దించుకోకుంటే.. గోదాంలలో నిల్వ చేసేందుకు అనుమతి కోరుతున్నాం.
– ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్


