ఎత్తుకు పైఎత్తు..!
● ఎన్నికల వేళ మారుతున్న
రాజకీయ సమీకరణాలు
● గ్రామాల్లో బలమైన నాయకులకు
అధికార, ప్రతిపక్ష పార్టీల గాలం
● జిల్లాలో జోరందుకున్న చేరికలు
వనపర్తి: పంచాయతీ పోరు పల్లె సీమలో రాజకీయ వేడిని రాజేస్తోంది. గ్రామాల్లో జనబలం ఉన్న నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేగంగా పావులు కుదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఇటీవల ఖిల్లాఘనపురం మండలం తిర్మలాయపల్లిలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఎత్తుగడలో భాగంగా గ్రామానికి చెందిన సుమారు 23 మందిని అధికార కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తాజాగా బీఆర్‌ఎస్ గోపాల్‌పేట మండలం బుద్ధారం గామానికి చెందిన కీలక నాయకులను గులాబీ గూటికి లాగేసుకుంది. సోమవారం తాజా మాజీ ఎంపీటీసీ శ్రీదేవి భర్త విష్ణువర్ధన్‌రావు, మాజీ సర్పంచ్ జాంప్లానాయక్ తదితర నాయకులకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓవైపు మలివిడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే.. పార్టీల్లో చేరికలు జోరందుకోవడం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది.
ఎత్తుకు పైఎత్తు..!


