ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
పాన్‌గల్: ఽదాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో తప్పక నమోదు చేయాలని, తేమ శాతం పేరుతో ఇక్కట్లకు గురి చేయొద్దని సూచించారు. ధాన్యం తరలించే వాహనాలు ఎక్కువ సమయం మిల్లుల వద్ద వేచి ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన దొడ్డురకం వరి ధాన్యం తూకం చేయడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని.. సన్నాలతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని కూడా వెంటనే తూకం చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం కస్తూర్బా విద్యాలయం సమీపంలో ఉన్న గోదాంను సందర్శించి మిగిలిన వంద శాతం రాయితీ వేరుశనగ విత్తనాలను పరిశీలించారు. బస్తాలకు రంధ్రాలు పడి మిగిలినవి అధికారులు వివరించగా బస్తాల్లో ఎత్తించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, డీటీ అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు.


