ఈసీ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్‌ప్రెస్ యజమానులతో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాల్లో కులం, మతం అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పబ్లిషర్ నుంచి ఫారం–ఏలో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం–ఏ, బితో పాటు ముద్రించిన 2 కరపత్రాలను జతపర్చి కలెక్టరేట్‌లో అందజేయాలన్నారు. ముద్రించిన కరపత్రం, గోడపత్రికపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, ఫోన్‌నంబర్ కచ్చితంగా ఉండాలన్నారు. ఎన్ని ముద్రించారు.. అందుకు తీసుకున్న పైకం వివరాలు ఫారం–బిలో నమోదు చేయాలని కోరారు. సమావేశంలో డీపీఆర్వో పి.సీతారాం, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణలో
పొరపాట్లకు తావివ్వొద్దు
కొత్తకోట రూరల్/గోపాల్‌పేట: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటిదశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఉమ్మడి గోపాల్‌పేట మండలంలోని గోపాల్‌పేట, బుద్దారం, తాడిపర్తి పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లిలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. వీరాయపల్లిలో కలెక్టర్‌తో పాటు ఎన్నికల పరిశీలకుడు మల్లయ్య భట్టు, ఖర్చు అబ్జర్వర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ కేంద్రాల్లో ఓటరు జాబితాను ప్రదర్శించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి రోజువారి నామినేషన్ల వివరాలను సాయంత్రం టీపోల్ యాప్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలని సూచించారు. అనంతరం ఖర్చు అబ్జర్వర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు నగదు ఖర్చు బుక్‌లెట్ ఇచ్చినప్పుడు ధ్రువీకరణ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారి వెంట గోపాల్‌పేట తహసీల్దార్ తిలక్‌రెడ్డి, ఎంపీడీఓ అయేషా, పెద్దమందడి తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీఓ తాళ్ల పరిణత, ఇతర అధికారులు ఉన్నారు.


