రాజ్యాంగ స్ఫూర్తితోనే సమర్థ సేవలు
వనపర్తి: భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఎస్పీ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ అనే పవిత్ర లక్ష్యాలతో కొనసాగుతున్న పోలీస్ వ్యవస్థకు రాజ్యాంగమే మార్గదర్శకమని తెలిపారు. ప్రతి అధికారి సమర్థవంతంగా విధులు నిర్వర్తించినప్పుడే సమాజ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ మరింత బలపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, పోలీసు కార్యాలయ ఏఓ సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ..
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్. సునీతను బుధవారం ఎస్పీ సునీతరెడ్డి జిల్లా కోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నివారణ చర్యలు, కోర్టు, పోలీసు విభాగాల పరస్పర సహకారం, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు.


