దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: డ్రాయింగ్, టైలరింగ్–ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులని..
www. bsetelangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌కు రూ.100, హయ్యర్ గ్రేడ్‌కు రూ.150, టైలరింగ్ – ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్‌కు రూ.150, హయ్యర్ గ్రేడ్‌కు రూ.200 రుసుం చెల్లించాలని సూచించారు. దరఖాస్తు గడువు డిసెంబర్ 5తో ముగుస్తుందని తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 12వ తేదీ వరకు, రూ.75 అపరాధ రుసుంతో వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫారాన్ని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
మహిళా చట్టాలపై
అవగాహన అవసరం
వనపర్తిటౌన్: మహిళలపై జరుగుతున్న దాడులను చట్టపరంగా ఎదుర్కోవాలంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని నాగవరంలో ఉన్న నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన మహిళా చట్టాల అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గృహహింస, పోక్సో, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు తదితర చట్టాల గురించి అవగాహన కల్పించారు. మహిళలు ఉచిత న్యాయసాయం పొందే హక్కు కలిగి ఉన్నారని గుర్తుచేశారు.అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, పారా లీగల్ వలంటీర్ బాలరాజు పాల్గొన్నారు.
నిరంతరం
అందుబాటులో ఉండాలి
గోపాల్‌పేట: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం రేవల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఏయే కేసులు నమోదు చేశారని ఎస్‌ఐ రజితను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై దృష్టి సారించాలని, గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తుల వివరాలు సేకరించాలని సూచించారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 442 క్యూసెక్కులు, సమాంతరం కాల్వ నుంచి 75 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 218 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
దరఖాస్తుల ఆహ్వానం


