శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● మారండి.. మంచిగా బతకండి
● రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించిన ఎస్పీ డి.సునీతరెడ్డి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు, వారి అనుచరులు, ప్రభావిత వ్యక్తులు ప్రజలను బెదిరించడం, గొడవలకు ప్రేరేపించడం, మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ సునీతారెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జంగాలగుట్ట, సాయినగర్‌కాలనీలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి వారి కదలికలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, ఎవరెవరితో మర్యాదగా నడుచుకోవాలి.. ఎవరికి దూరంగా ఉండాలనే విషయాలను వివరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే సహించేది లేదని.. శాంతిభద్రతల పరిరక్షణను నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్తారన్నారు. ఆమె వెంట డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, సీఐ కృష్ణయ్య, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
రహదారులను కల్లాలుగా మార్చొద్దు
రహదారులపై వరి ధాన్యం ఆరబోసి కల్లాలుగా మార్చడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకో వాలని ఎస్పీ సునీతరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రిళ్లు ధాన్యం కుప్పలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని.. పొలాలు, ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో రైతులకు విధిగా అవగాహన కల్పించాలని.. ఎవరైనా నిర్లక్ష్యంగా ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ..
సోమవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి.సునీతరెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు జిల్లాలో శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు


