విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
కొత్తకోట: ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేస్తూ విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగుపర్చాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సభ్యుడు డా. భరణి కోరారు. మంగళవారం ఆయన పుర కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఎమ్మార్సీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో అమలవుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్, ఏఎక్స్‌న్, ఎల్‌ఐపీ కార్యక్రమాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి మరింతగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మ్యాథమెటిక్స్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమ నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జె.కృష్ణయ్య, పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


