ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయని, వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా ప్రజావాణి, ఇన్‌చార్జ్ మంత్రి నుంచి వచ్చే వినతులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు మొత్తం 30 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ప్రజావాణికి అన్నిశాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా మండల అధికారులు పాల్గొన్నారు.
వాసెక్టమితోఆరోగ్యకర జీవితం..
కుటుంబ నియంత్రణ పాటించడంలో పురుషులు వాసెక్టమి శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యకర జీవితం పొందాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో వాసెక్టమి అవగాహన, శస్త్రచికిత్స పక్షోత్సవాలపై లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 4 వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో పురుషుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. సాయినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. వేసెక్టమిలో ఎలాంటి కోతలు, కుట్లు ఉండవని, కేవలం అర గంటలో శస్త్రచికిత్స పూర్తవుతుందన్నారు. గంటలో ఇంటికి వెళ్లవచ్చని, ఇతర సైడ్‌ఎఫెక్ట్‌లు ఉండవన్నారు. ఎలాంటి అపోహలు పడవద్దని, శస్త్రచికిత్స అనంతరం తమ భాగస్వామితో హాయిగా వైవాహిక జీవితం గడపవచ్చని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డిప్యూటీ కలెక్టర్ (ప్రొబేషన్) శ్రావ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


