విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
వనపర్తి: ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో 20 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదివిన పాఠశాల, కళాశాల భవనాలను రూ.50 కోట్లతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొత్త భవనం వనపర్తిలో ఉన్న చారిత్రక రాజభవన నమూనాను పోలి ఉంటుందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు ముమ్మరం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు సాయిచరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


