‘కురుమూర్తి’ హుండీ ఆదాయం రూ.84 లక్షలు
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని హుండీల ద్వారా మొత్తం రూ.84,12,564 ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం నెలరోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు వివిధ రకాల కానుకలు స్వామివారికి సమర్పించుకున్నారు. ఈ కానుకల హుండీని ఆలయ అధికారులు నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు లెక్కించారు. మొదటిసారి హుండీ ద్వారా రూ.28,70,536, రెండోసారి రూ.24,83,628 రాగా.. తాజాగా సోమవారం మూడోసారి లెక్కింగా రూ.30,58,400 వచ్చింది. దీంతో ఈ సంవత్సరం జాతర హుండీ ఆదాయం మూడు దఫాలు కలుపుకొని మొత్తం రూ.84,12,564 సమకూరినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి తెలిపారు. గతేడాది జాతర ద్వారా హుండీ ఆదాయం రూ.79,68,810 రాగా.. ఈసారి రూ.4,43,754 అదనంగా వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల నుంచి భక్తులు రావడంతో యూఎస్‌ఏ వన్ డాలర్లు 3, 5 డాలర్ 1, టెన్ డాలర్ 2 వచ్చాయి. అలాగే సింగపూర్ టెన్ డాలర్ 1, బ్యాంకాక్ వంద యూరోస్ 1, మలేషియా టెన్ యూరోస్ 1 వచ్చాయి.


