మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
గోపాల్‌పేట: మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని.. అప్రమత్తంగా ఉండి వాహనాలు ఇవ్వొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని సూచించారు. సోమవారం మండలంలోని బుద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తే పోక్సో కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలు తప్పవని, చిన్న వయసులో పెళ్లిళ్లు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు తక్కువ వినియోగించాలని, మేధస్సు పెంచే నీతికథలు, వినోద పుస్తకాలు చదివేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉచిత న్యాయసాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, శ్రీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


