మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
వనపర్తి: మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, మహిళలు, చిన్నారుల రక్షణకు ఆధునిక పోలీసింగ్ ప్రధాన ప్రాధాన్యత తీసుకుంటుందని ఎస్పీ డి.సునీత తెలిపారు. సోమవారం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు, పారదర్శక పాలన, సమర్థమైన నేర నివారణ, సాంకేతిక ఆధారిత సమాచార వ్యవస్థతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజలకు న్యాయం, వేగవంతమైన సేవ, భద్రతాభావం కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. డ్రగ్స్ మాఫియా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, అసాంఘిక ప్రవర్తనపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు, పిల్లలు భయం లేకుండా జీవించే వాతావరణం కల్పించడం పోలీసుశాఖ బాధ్యతని.. ప్రజల నమ్మకం పెరిగితేనే సమర్థ, ప్రభావవంతమైన పోలీసింగ్ సాధ్యమన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ప్రమోషన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని కోరారు. అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులు ఎస్పీకి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన ఎస్పీ డి.సునీత


