2024 కులగణన ప్రకారమే బీసీ రిజర్వేషన్లు
● గెజిట్ విడుదల చేసిన కలెక్టర్
● ఆర్డీఓ నేతృత్వంలో సర్పంచుల
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
● ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా ప్రాతిపదికనే..
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి జీఓ విడుదల చేయడంతో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న గ్రామపంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. మండలం యూనిట్‌గా సర్పంచ్, గ్రామం యూనిట్‌గా వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆర్డీఓ నేతృత్వంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 10.30 నుంచి రాత్రి 9 వరకు రిజర్వేషన్లపై కసరత్తు చేసి పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఆయన ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించి ఆమోదించి గెజిట్ విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2024 కులగణన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు గరిష్టంగా 50 శాతం మించకుండా జాగ్రత్తలు పాటించారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 268 గ్రామపంచాయతీలు, 2,436 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆయా మండలాల ఎంపీడీఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో మహిళా స్థానాల కేటాయింపునకు ఆర్డీఓ చేతుల మీదుగా డిప్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ అన్ని కేటగిరీల్లోనూ.. మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించారు. కలెక్టర్ గెజిట్ విడుదల చేయకముందే గ్రామాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల జాబితాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. నేతలు రానున్న ఎన్నికల సమరానికి తగిన ఏర్పాట్లను చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆయా రాజకీయ పార్టీల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది.


