సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకం
వనపర్తి: మానవ సేవే.. మాధవ సేవని నమ్మి ఎంతోమందికి సేవలందించిన సత్యసాయి భగవంతుడితో సమానుడేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. సత్యసాయి 100వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సత్యసాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజా సేవకై ట్రస్ట్ ఏర్పాటుచేసి అనేక రకాల సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే సత్యసాయి జయంతిని నేడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఆయన చూపిన సన్మార్గంలో నడిచి ప్రతి ఒక్కరూ ఇతరులపై ప్రేమాభిమానం చూపిస్తూ తగిన సాయం చేయగలిగితే మానవాళి సుఖసంతోషాలతో ఉంటారన్నారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి సత్యసాయి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, సత్యసాయి సేవాసమితి జిల్లా కమిటీ కన్వీనర్ సాయిరాం, సాయిరెడ్డి, యూత్ కో–ఆర్డినేటర్ నరహరి, మహిళా కో–ఆర్డినేటర్ భాగ్యమ్మ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


