● రాష్ట్ర యువజన క్రీడలు, పశుసంవర్దక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ఆత్మకూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. మహిళల కోసం అనే సంక్షేమ పథకాలు అమలుచేసి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్దక, మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో అమరచింత, ఆత్మకూర్ మండలాల మహిళా సంఘాల సభ్యులకు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం రూ.వేల కోట్లు వెచ్చించి సిరిసిల్లలో ప్రత్యేకంగా తయారుచేసిన చీరలు అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం, మహిళాశక్తి క్యాంటీన్లు, కల్యాణలక్ష్మి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, రాయితీ వంటగ్యాస్ తదితర పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత పాలకులు మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేశారని.. కోటిమంది మహిళలు కోటీశ్వరులు కావడమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు.
డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రాక..
జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో నిర్మించే హైలెవల్ వంతెన శంకుస్థాపన కార్యక్రమం డిసెంబర్ 1న నిర్వహిస్తున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. శనివారం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జూరాల గ్రామం వద్ద శంకుస్థాపన, హెలీప్యాడ్‌కు సంబంధించి స్థల పరిశీలన చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో నూతనంగా నిర్మించనున్న 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
డయాలసిస్ కేంద్రం, ఓపెన్‌జిమ్ ప్రారంభం..
ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని, పుర కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను మంత్రి, కలెక్టర్, శాట్ చైర్మన్ ప్రారంభించారు. కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్ సేవల కోసం వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడలశాఖ అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డి, గీతకార్మిక విభాగం రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, విండో అధ్యక్షుడు కృష్ణమూర్తి, డీఆర్డీఓ సరోజ, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, నాయకులు గంగాధర్‌గౌడ్, పరమేష్, నల్గొండ శ్రీను, తులసీరాజ్ తదితరులు పాల్గొన్నారు.


