ఆర్బీవీఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
కొత్తకోట రూరల్: రాజా బహదూర్ వెంకట రామరెడ్డి సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి కొనియాడారు. శనివారం మండలంలోని విలియంకొండ సమీపంలో ఉన్న ఆర్బీవీఆర్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకట రామరెడ్డి స్థాపించిన ఆర్బీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. సమాజానికి పెద్ద సేవ అని.. విద్యావ్యవస్థలో ట్రస్ట్ పాత్ర అపురూపమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గదుల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన వసతులు, మంచి భవిష్యత్ అందించడమే ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డా. రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, గ్రామపెద్దలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


